ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?

  • ఈపీఎఫ్‌లో 15జీ, 15హెచ్‌ ఫారాల స్థానంలో కొత్త ఫారం 121
  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం
  • టీడీఎస్ మినహాయింపు కోసం వయసుతో సంబంధం లేకుండా ఒకే ఫారం
  • ఏటా ఫారం 121 సమర్పించకపోతే విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ వర్తింపు
  • ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఈ మార్పులు అమలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తన నిబంధనలలో ఒక కీలకమైన మార్పును ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి రావడంతో పీఎఫ్ ఖాతాదారులు టీడీఎస్ మినహాయింపు కోసం ఉపయోగించే ఫారం 15జీ, ఫారం 15హెచ్‌లను రద్దు చేసింది. వాటి స్థానంలో ఏకీకృత ఫారం 121ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం 2026, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈపీఎఫ్‌ఓ ఈ నెల‌ 13న జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ మార్పుతో టీడీఎస్ మినహాయింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

ఇంతకుముందు ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం.. 60 ఏళ్లలోపు వారు తమ ఆదాయం పన్ను పరిధిలోకి రానప్పుడు టీడీఎస్ మినహాయింపు కోసం ఫారం 15జీ సమర్పించేవారు. అలాగే, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఫారం 15హెచ్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు ఈ వయోపరిమితి ఆధారిత విధానాన్ని తొలగించి, అందరికీ వర్తించేలా ఒకే ఫారం 121ను తీసుకొచ్చారు. "ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి రావడంతో పాత ఫారాల స్థానంలో ఏకీకృత డిక్లరేషన్ అయిన ఫారం 121ను ప్రవేశపెట్టాం" అని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరు అర్హులు?
ఫారం 121 అనేది ఒక స్వయం ధ్రువీకరణ పత్రం. తమ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాదని, తమకు టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పన్ను చెల్లింపుదారులు దీనిని సమర్పిస్తారు. ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్, వడ్డీ, డివిడెండ్లు వంటి ఆదాయాలపై టీడీఎస్ కోత పడకుండా ఇది సహాయపడుతుంది. నివాస భారతీయులు (సీనియర్ సిటిజన్లతో సహా), హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), అర్హత కలిగిన కొన్ని ట్రస్టులు సైతం ఈ ఫారాన్ని ఫైల్ చేయవచ్చు. 

ప్రధాన మార్పులు
ఫారం 15జీ, 15హెచ్‌లను రద్దు చేసి వాటి స్థానంలో ఈ ఒక్క ఫారాన్నే తీసుకొచ్చారు. ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసినప్పుడు టీడీఎస్ పడకుండా నివారిస్తుంది. ఈ ఫారం సమర్పించిన ప్రతిసారీ పారదర్శకత కోసం ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN) కేటాయిస్తారు. అర్హతను నిర్ధారించుకోవడానికి గత రెండు సంవత్సరాల ఐటీఆర్ అక్‌నాలెడ్జ్‌మెంట్ వివరాలను జతచేయాల్సి ఉంటుంది. దీనిని ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఖాతాదారులు ఏం చేయాలి?
2026, ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ చందాదారులు టీడీఎస్ మినహాయింపు కోరుకుంటే పాత ఫారాలకు బదులుగా ఫారం 121ను ఉపయోగించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దీనిని తప్పనిసరిగా సమర్పించాలి. ఒకవేళ ఈ ఫారాన్ని సమర్పించకపోతే రూ. 50,000 దాటిన విత్‌డ్రాయల్స్‌పై నిబంధనల ప్రకారం టీడీఎస్ కట్ అవుతుంది. ఖాతాదారులలో గందరగోళాన్ని తగ్గించి, ప్రక్రియను సరళీకృతం చేయడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.

EPFO
Form 15G
Form 15H
Form 121

More Telugu News